![]()
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో:
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 12 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో మార్చి 14 శుక్రవారం ఉదయం 06 గంటల నుంచి సాయంత్రం 06 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
హోళీ పండుగ సందర్భంగా మార్చి 14న ఉదయం 06 గంటల నుండి సాయంత్రం 06 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని రాచకొండ పోలీస్ కమీషనర్ జీ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయబడతాయని తెలిపారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లకు ఇందులో నుంచి మినహాయింపు ఉండనుంది.
హైదరాబాద్ కమీషనరేట్ నుంచి కూడా ఇదే విధమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. హోళీ పండుగ నేపథ్యంలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, అనుబంధంగా ఉన్న బార్లను మార్చి 14న ఉదయం 08 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు మూసివేయబడతాయని పేర్కొంది. 1948 ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20 కింద హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఈ నోటీసు జారీ చేసింది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, హోళీ పండుగ నేపథ్యంలో నగరంలో పలు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల మీద వెళ్లే వారిపై వారి అనుమతి లేకుండా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజలకు అసౌకర్యం, చికాకు, ప్రమాదాన్ని కలిగించే విధంగా వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో బైక్‌లు, ఇతర వాహనాల్లో గుంపులుగా తిరగడంపై నిషేధం విధిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు…
మార్చి 13 సాయంత్రం 06 గంటల నుంచి మార్చి 15 ఉదయం 06 గంటల వరకు అమలులో ఉండనున్నాయి.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో..
మార్చి 14 ఉదయం 06 గంటల నుంచి మార్చి 15 ఉదయం 06 గంటల వరకు అమలులో ఉంటాయి.


